మూగజీవిపై మానవత్వం చాటిన యువకులు!
- డ్రైనేజీ కాలువలో పడిన గోమాతకు ప్రాణదానం.. అరగంట శ్రమించి సురక్షితంగా బయటకు తీసిన యువకులు
సత్తుపల్లి: ఆపదలో ఉన్న మూగజీవి పట్ల మానవత్వంతో స్పందించిన స్థానిక యువకులు అభినందనలు అందుకున్నారు. ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాలువలో పడిపోయిన గోమాతను యువకులు సమయస్ఫూర్తితో స్పందించి సాహసోపేతంగా రక్షించారు.
సత్తుపల్లి పట్టణంలోని పోస్టాఫీస్ నుంచి కృష్ణమందిరానికి వెళ్లే రహదారిలో అటవీ శాఖ సమీపంలోని మురుగునీటి కాలువలో మంగళవారం రాత్రి ఓ సూడి పశువు ప్రమాదవశాత్తు పడిపోయింది. సుమారు నాలుగు అడుగుల లోతు ఉన్న కాలువలో పడిన పశువు పైకి లేవలేక, బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
అదే సమయంలో అటుగా వెళ్తున్న స్థానిక యువకులు పశువును గమనించి వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు. తాళ్ల సహాయంతో పశువును బయటకు తీసేందుకు దాదాపు అరగంట పాటు శ్రమించారు. చివరకు యువకుల సమష్టి కృషితో గోమాతను సురక్షితంగా బయటకు తీశారు.
తమ పనులను పక్కనపెట్టి ఆపదలో ఉన్న మూగజీవి ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చిన యువకులపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. మూగజీవాల పట్ల కనబరిచిన ఈ మానవత్వం, సేవాభావం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పలువురు కొనియాడారు.