వనపర్తి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ
- జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అందేలా చూస్తా : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి జిల్లాలో జర్నలిస్టుల ఐక్యతకు ప్రతీకగా ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఈ నెల 13న సురవరం ప్రతాపరెడ్డి సాక్షిగా ప్రెస్ క్లబ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జర్నలిస్టుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు.
ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, జర్నలిస్టులకు అవసరమైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జర్నలిస్టులు ఐకమత్యంతో ముందుకు సాగాలని, వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు, వివిధ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.