🏠 cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 10:30 pm Posted by : Chand Pasha

ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

News Image
  • వైద్య సేవల ధరల పట్టికలను రోగులకు కనిపించేలా ప్రదర్శించాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆసుపత్రుల్లో వివిధ వైద్య సేవలకు సంబంధించిన ధరల పట్టికలను రోగులకు స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో కొత్త ప్రైవేట్ ఆసుపత్రుల ఏర్పాటుకు అనుమతులు, ఆసుపత్రుల రెన్యూవల్, డయాగ్నస్టిక్ సెంటర్ల అనుమతుల పునరుద్ధరణకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమర్పించిన 10 ప్రతిపాదనలను కమిటీ పరిశీలించింది. సంబంధిత నిబంధనలు, ప్రమాణాలు పాటించిన దరఖాస్తుదారులకు అనుమతులు మంజూరు చేసింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులకు అందించే వైద్య సేవల్లో పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన వైద్య సదుపాయాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించిన ధరల వివరాలను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా రోగులకు స్పష్టత కల్పించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా, నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రులు నిర్వహించినా సంబంధిత యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సంబంధిత అధికారులు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
🏠 Home