సత్యం, ధర్మం, నైతిక విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
- జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
- కలెక్టరేట్‌లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
- ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్
మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సత్యం, ధర్మం, నైతిక విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహర్షి వాల్మీకి బోధనలు, ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
సమాజంలో సత్యం, ధర్మం, నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. మహర్షి వాల్మీకి ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో మంచి మార్పులకు దోహదపడాలని పిలుపునిచ్చారు.
మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను స్మరించుకుంటూ, ఆయన బోధించిన విలువలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.