🏠 cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 26 September 2026, 5:07 pm Posted by : CK NEWS

అమరవాదిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం

News Image
  • *అమరవాదిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం*
  • *ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రకటనలు మానుకోవాలి*
  • – కొదుమూరి జగన్నాథం గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

సి కె న్యూస్ ప్రతినిది ఖమ్మం, సెప్టెంబర్ 26:తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీ నారాయణపై కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొదుమూరి జగన్నాథం గుప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్యవైశ్య మహాసభ బలోపేతానికి ఏనలేని కృషి చేశారు అమరవాది . ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన అనంతరం సభ్యత్వాలను పెంచడం, లీగల్‌గా ఎదురైన ఇబ్బందులను పరిష్కరించడం, సంఘాన్ని పటిష్టం చేయడం వంటి అనేక అంశాల్లో అమరవాది లక్ష్మీ నారాయణ కృషి చేశారని తెలిపారు. ఆ సమయంలో ప్రభుత్వ సహకారంతో 5 ఎకరాల స్థలం సాధించడంలో కూడా విజయం సాధించారని పేర్కొన్నారు. సమాజ కార్యక్రమాల కోసం అమరవాది తన సొంత ఖర్చులతో, సొంత నిధులతో తిరుగుతున్నారని, ఎలాంటి అపచర్యలకు పాల్పడలేదని, నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు.

దొంగ లేదా డూప్లికేట్ సభ్యత్వాల పేరుతో నిరాధార ఆరోపణలు చేస్తూ ఆర్యవైశ్య సమాజంలో అపోహలు సృష్టించడం సరికాదని జగన్నాథం గుప్తా అన్నారు. ఆర్యవైశ్య ఆత్మీయ భవనం, తిరుమలలో తెలంగాణ భవనం, చింతల్‌బస్తీలోని భవనం రినోవేషన్ వంటి సమాజ అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతల సహకారాన్ని పదవులతో ముడిపెట్టడం తగదన్నారు. పదవులను ఎవరూ డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, సభ్యత్వాల సేకరణపై కూడా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ద్వారా ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని సూచించారు. ముఖ్యంగా, అమరవాది కార్యవర్గంలో గతంలో పనిచేసిన వారు ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు మౌనంగా ఉండి ఇప్పుడు మాత్రమే ఈ ఆరోపణలు చేస్తున్నారో సమాజానికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

చింతల్‌బస్తీలోని భవనాన్ని తెలంగాణకు కేటాయించాలనే అంశంపై అమరవాది లక్ష్మీ నారాయణ పోరాటం చేశారని, ఉప్పల్ భగాయత్‌లో స్థలం కేటాయింపునకు సంబంధించి అప్పటి ప్రభుత్వ హయాంలో జీవో జారీ అయిందని తెలిపారు. సమాజ అభివృద్ధికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు ముందుకు సాగుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు చేయడం వల్ల సమాజానికే నష్టం జరుగుతుందని అన్నారు. కోర్టు ప్రక్రియకు అనుగుణంగా ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడినప్పుడు ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి లేదా ఇతర ప్రముఖులు హాజరైన సమాజ కార్యక్రమాలను కూడా రాజకీయ కోణంలో విమర్శించడం కంటే, వాటి ద్వారా ఆర్యవైశ్య సమాజానికి కలిగే ప్రయోజనాలను చూడాలని సూచించారు.

ఆర్యవైశ్యులు ఎవరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరని, ప్రతి విషయాన్ని ఆలోచించి, పరిశీలించి నిర్ణయం తీసుకునే సమాజం ఆర్యవైశ్య సమాజమని కొదుమూరి జగన్నాథం గుప్తా అన్నారు. 12 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమీ చేయలేదని చెప్పడం సబబు కాదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సభ్యత్వాల విస్తరణ, న్యాయపరమైన సమస్యల పరిష్కారం, సంఘ పటిష్టతతో పాటు భవిష్యత్ నిర్మాణాలకు పునాది వేసే కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. తిరిగి అధికారంలోకి రావాలనుకునే వారు ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి ఆర్యవైశ్యుల మనసులు గెలుచుకోవాలని సూచించారు. ఎన్నికలు మళ్లీ వస్తాయని, అప్పుడు తమ పనితీరును ప్రజల ముందు ఉంచి మద్దతు కోరవచ్చని, ఎవరిని ఎన్నుకోవాలో ఆర్యవైశ్య సమాజమే నిర్ణయిస్తుందని అన్నారు.
🏠 Home